ఏపీలో ఇసుక కొరతపై సమర శంఖాన్ని పూరించనుంది జనసేన. ఆదివారం విశాఖ వేదికగా ఇసుక కొరతను నిరసిస్తూ భారీ లాంగ్ మార్చ్‌కు జనసేన శ్రేణులు సిద్ధం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్.. మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్టల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర జనసేన లాంగ్ మార్చ్ జరగనుంది. తరువాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న పవన్ కల్యాణ్.. జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇసుక విధానంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నారు.
లాంగ్ మార్చ్ కోసం విశాఖతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి జనసేన శ్రేణులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలి రానున్నారు. దీంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అటు.. లాంగ్ మార్చ్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వాహనాలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులుకు పనులు లేక రాబడి రాక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు పవన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో ఇసుక కొరతను సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్.. పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిర్మాణ రంగ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ పిలుపునిచ్చారు పవన్.
భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ లాంగ్ మార్చ్‌కు టీడీపీ ఇప్పటికే సపోర్ట్ చేసింది. తమ పార్టీ ముఖ్య నేతలు మార్చ్‌లో పాల్గొంటారని చంద్రబాబు ప్రకటించారు. దీంతో జనసేన తలపెట్టిన ర్యాలీకి టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు. ఆదివారం జరగబోయే లాంగ్ మార్చ్‌తో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించనున్నారు జనసేన అధినేత.