ఓ పందెం అతడి ప్రాణం తీసింది. యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన సుభాష్ యాదవ్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు కోసమని ఈమధ్యే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య ప్రస్తుతం గర్భవతి. సుభాష్ తన స్నేహితుడితో గుడ్లు తినడంపై పందెం కాశాడు. ఎవరు ఎక్కువ గుడ్లు తింటే వారే పందెంలో గెలుస్తారని అన్నాడు. 50 గుడ్లు తిని ఒక మద్యం బాటిల్ తాగాలని, ఇలా చేస్తే గెలిచిన వారికి రూ.2000 బహుమతిగా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. దీనికి అంగీకరించిన సుభాష్ గుడ్లు తినడం ప్రారంభించాడు. ఏ సమస్యా లేకుండా 41 గుడ్లను తినేశాడు. 42వ గుడ్డును తింటుండగా స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టూ చేరిన జనం వెంటనే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించిందని లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ సుభాష్ మృతి చెందాడు. ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు, మళ్లీ ఇప్పుడు మరో పిల్లో పిల్లడో రెండో భార్య కడుపులో.. ఇంత మందిని అన్యాయం చేసి వెళ్లి పోయాడని కుటుంబసభ్యులు కలత చెందుతున్నారు. పందెం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడని వృద్ధాప్యంలో ఉన్న సుభాష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.