హైదరాబాద్‌ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా..

Update: 2019-11-04 02:07 GMT

 

హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కోటికి పైగా జనాభా, లక్షల్లో వాహనాలు.. దీనికి తోడు ప్రతీరోజు వెయ్యి కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చి చేరుతున్నాయి. దీంతో సిటీలో ట్రాఫిక్ నిత్యనరకంగా మారింది. ఇక పీక్ అవర్స్‌లో అయితే బంపర్ టూ బంపర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తీసుకువచ్చిన SRDP ఫలాలు ఒక్కటోక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే 3 అండర్ పాసులు, 4 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా.. తాజాగా బయోడైవర్సిటీ వద్ద మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది.

SRDPలో భాగంగా 69.47 కోట్ల వ్యయంతో బయోడైవర్సిటీ జంక్షన్‌ దగ్గర GHMC నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. 900 మీటర్ల పొడవున మూడు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌‌తో మెహదీపట్నం, ఖాజాగూడ నుంచి మైండ్‌ స్పేస్‌ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. పైగా మెహదీపట్నం నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసిరానుంది.

నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఓవైపు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. మెట్రోలో నిత్యం 4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అయినా కూడా రోడ్లపై ట్రాఫిక్ తగ్గడం లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. SRDPలో భాగంగా 25 వేల కోట్ల రూపాయలతో నగరంలోని ప్రధాన జంక్షన్‌లలో ఫ్లైఓవ‌ర్లు, అండర్ పాసులు, దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణాల ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు మొదలుపెట్టిన SRDP పనుల్లో భాగంగా నగరానికి ఈస్ట్ ప్రాంతం అయిన LB నగర్‌లో, వెస్ట్ ప్రాంతమైన శేరిలింగంపల్లి, కూకట్ పల్లిలో ఎక్కువగా ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం సాగుతుంది. SRDP పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. షాంఘై, సింగపూర్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాల సరసన గ్రేటర్‌ హైదరాబాద్‌ చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.