ఆమె కోసం అతడు.. 30 ఏళ్లుగా పెళ్లి కూతురిలా ముస్తాబై..

Update: 2019-11-05 06:17 GMT

నా చావుకి నువ్వే కారణం.. చచ్చేదాకా చీర కట్టుకో అని రెండో భార్య కల్లోకి వచ్చి చెప్పింది. దాన్ని తుచ తప్పకుండా పాటిస్తున్నాడు 30 ఏళ్లుగా చీర కట్టి సింగారించుకుంటున్నాడు యూపీ జలాల్‌పూర్ జిల్లా హజ్ ఖాన్ గ్రామ నివాసి చింతాహరణ్ చౌహాన్ అనే వ్యక్తి. ఒక పెళ్లి కలిసి రాలేదు.. ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అదీ అంతే.. ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె కూడా అతడిని ఒంటరి వాడిని చేసి వెళ్లి పోయింది. అదే అతడి జీవితానికి శాపమైంది. మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, ఇలా వరుసగా ముగ్గురూ చనిపోయారు.

చౌహాన్ గత 30 ఏళ్ల నుంచి మహిళలాగా చీర కట్టుకుంటున్నాడు. దాంతో పాటు చేతులకు గాజులు, చెవులకు పోగులు, ముక్కుకి పెద్ద ముక్కెర పెట్టుకుంటారు. జడ వేసుకుని పూలు కూడా పెట్టుకుంటాడు. నుదుటన బొట్టు పెట్టుకుని అచ్చంగా ఓ పెళ్లి కూతురిలా రెడీ అవుతాడు.

తన అలంకరణ వెనుక ఓ కన్నీటి గాధ వుందని చెబుతాడు చౌహాన్. 14 ఏళ్ల వయసున్నప్పుడు చౌహాన్ పశ్చిమ బెంగాల్‌లోని దీనాజ్‌పూర్‌లో ఒక ఇటుక బట్టీలో పనికి వెళ్లాడు. అక్కడ యజమాని చెప్పినట్లు చేస్తుండేవాడు. పనిలో అతడి శ్రద్దను గమనిస్తూ వచ్చాడు యజమాని. అతడికి తన కూతురుని ఇచ్చి వివాహం చేశాడు. అయితే చౌహాన్ కుటుంబసభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దాంతో ఊరికి వచ్చేయమంటూ గొడవ చేశారు. దాంతో భార్యని పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబసభ్యులు చౌహాన్‌కు మళ్లీ పెళ్లి చేశారు. ఆమె కొన్ని రోజులకు మరణించింది. తిరిగి మొదటి భార్య దగ్గరకు వచ్చాడు. కానీ అప్పటికే భర్త తనను వదిలి వెళ్లి పోయాడని కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్నాడు.

ఇంటికి వెళ్లి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని రోజులకు అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెతో పాటు ఇంట్లో ఒక్కొక్కరూ ఏదో ఒక కారణంతో చనిపోతుండేవారు. తండ్రి, అన్న, తమ్ముడు, తమ్ముడి భార్యా, పిల్లలు ఇలా వరుసగా మృత్యుదేవత ఒడిని చేరుకుంటున్నారు. తన ఈ పరిస్థితికి చింతిస్తూ కూర్చున్న చౌహాన్‌కి ఓ రోజు రాత్రి రెండో భార్య కల్లోకి వచ్చింది. నేను నిన్నెంతో ప్రేమిస్తే నన్ను వదిలేసి వెళ్లి పోయావు. నీ కుటుంబసభ్యుల మరణానికి నా శాపమే కారణమని చెప్పింది. నేను నీతోనే ఉండాలనుకుంటున్నా. అందుకు రోజూ నువ్వు చీర కట్టుకోవాలని చెప్పింది. దాంతో ఆరోజు నుంచి చౌహాన్ చీర కట్టుకోవడం మొదలు పెట్టాడు. ఇలా తయారవడం మొదట్లో తనకూ ఇష్టం లేదని కానీ తప్పని పరిస్థితి. కళ్ల ముందే అయినవాళ్లంతా ఒక్కొక్కరిగా తనని విడిచి వెళ్లిపోతుంటే ఒంటరి వాడయ్యాడు. తాను వేషం మార్చుకున్నప్పటి నుంచి కుటుంబంలో మరణాలు తగ్గాయని, తన ఆరోగ్యం కూడా బాగుందని అంటున్నాడు చౌహాన్.

Similar News