ఇకపై ఏటీఎం సెంటర్‌కి వెళ్లి డబ్బు డ్రా చేసే పన్లేదోచ్..

Update: 2019-11-07 06:17 GMT

కూర్చున్న చోటుకే అన్నీ.. పైసా కష్టపడక్కర్లేదు.. పైసల్ మీ చేతిలో కొస్తయ్.. లేటెస్ట్ టెక్నాలజీ అండీ.. పర్సులో డబ్బుల్లేవు.. ఏటీఎం సెంటర్‌కి వెళ్లి డబ్బు డ్రా చేసే టైమ్ అస్సలు లేదు.. బాబు బాగా బిజీ..

ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్ ఉత్తరాలు బట్వాడా చేసేవారు. రాను రాను స్మార్ట్‌ఫోన్లు అందరి చేతిల్లో ఉండేసరికి వారికి పని తగ్గిపోయింది. దీంతో ఏటీఎం డ్యూటీని వారికి అప్పగించారు. మొబైల్ ఏటిఎంకి మీరు ఓ కాల్ చేస్తే పోస్ట్ మ్యాన్ మీ ఇంటి ముందు ఉంటారు. ఇందుకు మీరు చేయవలసిందల్లా మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నెంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్ మ్యాన్ మొబైల్ మైక్రో ఏటీఎంతో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. మీకెంత కావాలో అంత అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. రూ.100 నుంచి రూ.10వేల వరకు పొందొచ్చు.

తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును తపాలా శాఖ కల్పించింది.

ఇందుకుగాను 950 మంది పోస్ట్‌మేన్‌లకు శిక్షణ ఇచ్చింది. మొబైల్ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్‌లోడ్ చేసి మొబైల్ ఫోన్లను అందజేసింది. 155299 నంబర్‌కు రిక్వెస్ట్ పంపగానే.. ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ మొబైల్ మైక్రో ఏటీఎంతో మీ ఇంటి వద్దకు వస్తారు. వారు తెచ్చిన మెషిన్‌లో మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఎంత నగదు కావాలి.. బ్యాంకు పేరు.. తదితర వివరాలను ఎంటర్ చేయాలి. ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంటుంది. డబ్బు మీ చేతిలో ఉంటుంది.

Similar News