రోజూ ఉదయం నుంచి సాయింత్రం వరకు అదే పని.. కనీసం ఆ ఒక్కరోజైనా మీ పిల్లలకోసం.. ఇంట్లో ఉండి కూడా ఆఫీస్ పని.. అదేమంటే భార్య పిల్లల కోసమేగా కష్టపడేది అంటారు. ఒక్క క్షణం ఆలోచించారా.. అంత బిజీగా ఉంటూ మీరు గానీ.. మీ పిల్లలు గానీ సంతోషంగా ఉన్నారా.. స్కూల్లో ఏం చెప్పారని ఒక్కరోజైనా అడిగారా.. పోనీ మీ పిల్లల ఫ్రెండ్స్ పేర్లైనా తెలుసా.. పేరెంట్స్ మీటింగ్‌కి ఎప్పుడైనా వెళ్లారా.. అందుకేనండి నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ ఒక్కరోజైనా ఫోన్ పక్కన పెట్టమంటోంది తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్.
విద్యాశాఖ ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం ఆ ఒక్కరోజైనా ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయండి. పిల్లలతో ఆ సమయాన్ని ఆనందంగా గడపండి అంటోంది. ఆ రోజు ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పేరెంట్స్ ఫోన్లు ముట్టుకోవద్దని సూచిస్తోంది. దీనిని వారానికి ఒకసారి అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది తమిళనాడు విద్యాశాఖ. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు దీనిని ఆచరణలో పెట్టాలని సూచించింది.
తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే బ్యాగు పక్కన పడేసి సెల్ చూస్తూ గడిపేస్తున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే సెల్ చేతిలో ఉండట్లేదు ఈ రోజుల్లో పిల్లలకు కూడా. టీచర్లు కూడా స్కూల్‌కి సంబంధించిన విషయాలు, హోం వర్క్‌లు, నోట్సులు అంటూ అన్నీ వాట్సప్‌లో పంపిస్తున్నారు. ఆ పేరుతో పిల్లలు ఫోన్ అడిగి గంటలు గంటలు వారి దగ్గరే ఉంచుకుంటున్నారు. అదేమంటే టీచర్లే పంపిస్తున్నారు. మమ్మల్నేం చేయమంటారు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
ఏమైనా ముందు రోజులే బావున్నాయి. డైరీలో రాసి పంపించేవారు. ఇప్పుడేమో టెక్నాలజీని వినియోగించుకోవాలంటున్నారు కానీ ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నారో ఆలోచించట్లేదు. తమిళనాడు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదే. ఈ రూల్ అందరూ పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి.