రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. క్యాంప్ ఆఫీస్‌లో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలన్నారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు చెప్పారు.
ఏయే ప్రాంతాల్లో ఎంతెంత ధరలు ఉండాలనే దానిపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలన్నారు.. రేటు నిర్ణయించిన తర్వాత ధరలను ప్రకటించాలని.. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలని అన్నారు. నిర్ణయించిన రేటుకే ఇసుక విక్రయించాలని స్పష్టంగా చెప్పారు. అలాగే సరిహద్దుల్లో నిఘా పెంచాలని, స్మగ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు జగన్. వరద నీరు తగ్గగానే అన్ని రీచ్‌లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలన్నారు. ప్రతి రీచ్ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని.. ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలని అన్నారు. ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలన్నారు. అవసరమైతే స్టాక్ పాయింట్లు పెంచాలన్నారు. ఇసుక విషయంలో ఎవ్వరూ వేలెత్తిచూపకుండా ఇసుక సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరోవైపు బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం జగన్ జలవనరులు, టూరిజం, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోటు ప్రమాదాలు, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదాల నివారణ, భద్రత కోసం ఎనిమిది చోట్ల కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న ఈ కంట్రోల్ రూమ్‌లలో జలవనరులశాఖ, పోలీసులు, టూరిజం విభాగాల నుంచి సిబ్బందిని నియమిస్తారు. నవంబర్ 21న ఈ ఎనిమిది కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 90 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
తనిఖీల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రం సహించబోనని సీఎం జగన్ తేల్చి చెప్పారు.. తనిఖీల తర్వాతే బోట్లకు అనుమతులు ఇవ్వాలని, ఆపరేటింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆధారంగా బోట్లు నడవాలని ఆదేశించారు. వరద ప్రవాహాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, బోట్ల కదలికలపై నిరంతర సమాచారాన్ని సేకరిస్తూ.. వాటి ప్రయాణాలను పర్యవేక్షించాలని సీఎం అధికారులకు సూచించారు. బోట్లకు జీపీఎస్ కూడా పెట్టాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా కంట్రోల్ రూమ్‌లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.