అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంపై కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ధర్మాసనం తీర్పును అనుసరించి రామమందిరం నిర్మాణ పర్యవేక్షణకు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలను ప్రారంభించింది. ట్రస్ట్ ఏర్పా టు, దాని విధివిధానాలను రూపొందించేందుకు కేంద్ర హోంశాఖ, ఆర్థిక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతోపాటు పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ట్రస్ట్‌లో ఎవరెవరికి భాగస్వామ్యం కల్పించాలనేది నిర్ణయించడానికి ముందుగా సుప్రీంకోర్టు తీర్పును అధికారుల బృందం అధ్యయనం చేస్తుంది.
ట్రస్ట్ ఏర్పాటుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయ శాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. అయోధ్య ట్రస్ట్‌కు నోడల్ సంస్థగా కేంద్ర హోం శాఖ ఉంటుందా లేక సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఉంటుందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సాధ్యమైనంత త్వరగా దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
అటు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు మీద సమీక్ష కోరాలా వద్దా అనే విషయంపై ఈ నెల 17న జరిగే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు పలు ముస్లిం వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో సమీక్ష కోరుతారని సమాచారం.