మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందన్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు మూడుపార్టీలకు చెందిన నేతలు గవర్నర్ కోషియార్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా లేఖ ఇవ్వనున్నారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇచ్చేందుకు NCP-కాంగ్రెస్ ఒప్పుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. డిప్యూటీ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకరించాయి. CM పదవితోపాటు మంత్రి పదవుల్లో సింహభాగం శివసేనకే దక్కనున్నాయి. శివసేనకు 16, NCPకి 14, కాంగ్రెస్‌కి 12 మంత్రి పదవులు ఉండేలా ఒప్పందం కుదిరింది. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు దక్కనుంది. మండలి ఛైర్మన్ పదవి ఎన్సీపీకి ఇవ్వనున్నారు. డిప్యూటీ స్పీకర్ శివసేనకు ఇస్తారు.
పారదర్శకనమైన పాలన అందించేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం సిద్ధం చేస్తున్నామని మాజీ సీఎం పృద్వీరాజ్ చవాన్ చెప్తున్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇతరత్రా అంశాల ఆధారంగా 40 పాయింట్లతో CMP సిద్ధం చేశారు. దీన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, NCP చీఫ్ శరద్ పవార్‌తోపాటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆమోదించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం కొలిక్కి వస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్టే. ఇక సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు ఒప్పుకున్నా ఆ పార్టీ నుంచి ఎవరు దీన్ని చేపడతారు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.