రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్‌ మృతి

Update: 2019-11-17 05:34 GMT

కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతిచెందాడు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్‌ మరణించాడు. ఈనెల 11న కాచిగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఎంఎంటీఎస్‌ ఢీకొట్టింది.. ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో ఆయన్ను బయటకు తీసేందుకు సహాయక బృందాలు 8 గంటలపాటు శ్రమించాయి. చివరకు సురక్షితంగా బయటకు తీసి నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు అధికారులు.

ప్రమాదంలో చంద్రశేఖర్‌ కుడికాలు ఛిద్రమైంది. రక్తనాళాలతోపాటు కండరాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మొదట్లో ఆయన శరీరం చికిత్సకు సహకరించినా ఆ తర్వాత చంద్రశేఖర్‌ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. శరీరంలోని కొన్ని భాగాలకు రక్త సరఫరా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్‌ఫెక్షన్‌ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి కాలిని వైద్యులు తొలగించారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌ను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. కార్డియాక్‌ అరెస్టుతో చంద్రశేఖర్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన చంద్రశేఖర్‌ 2011లో రైల్వే ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్న ఆయన.. హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ మెకానిక్‌ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితమే బాబు పుట్టడంతో.. భార్యా, పిల్లలు ఏలూరులో ఉన్నారు. చంద్రశేఖర్‌ మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తన భర్త లేడన్న వార్తను తట్టుకోలేక చంద్రశేఖర్‌ భార్య రోదిస్తున్న తీరు అందరి గుండెలను పిండేస్తోంది.