ఇకపై టోల్ గేట్ దగ్గర ఆగేపన్లేదోచ్.. డిసెంబర్ 1 నుంచి..

Update: 2019-11-21 08:43 GMT

ఊరెళ్లాలంటే ఉదయాన్నే బయల్దేరాలి.. లేదంటే బోలెడు ట్రాఫిక్.. రోడ్డు ఫ్రీగా ఉంది కదా అని రయ్ మంటూ దూసుకుపోతుంటే టోల్ గేట్ దగ్గర కారుకి బ్రేకులు పడతాయి. ఇలా ఓ 100 కిలో మీటర్ల దూరానికి 2,3 సార్లు ఆగాల్సిన పరిస్థితి. టోల్ కట్టేలోపు వెనుక ఎన్నో వాహనాలు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఎదురు కాదు. ఎందుకంటే FASTag ద్వారా మీ చెల్లింపులు జరిగిపోతాయి. సమం వృధా కాదు.. ట్రాఫిక్ నిలిచిపోదు.

FASTag ద్వారా లింక్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ నుంచి లేదా డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిగ్గా డబ్బులు కట్ అవుతాయి. నిజానికి ఈ విధానం 2016లో ప్రారంభించినప్పటికీ దీనిని డిసెంబర్ 1, 2019 నుంచి తప్పనిసరి చేయాలని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసిన కార్లకు FASTag అమర్చి ఉంది. వీటిని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. అదే పాతకారైతే మాత్రం HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, Paytm, అమెజాన్ వంటి వాటి నుంచి ఈ ట్యాగ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

వీటితో ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. FASTag కావాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహనం ఆర్సీ, గుర్తింపు కార్డు జిరాక్సులు రెండు సెట్లు, ఓ పాస్ పోర్టు సైజు ఫోటో, ఛార్జ్ చెల్లించాలి. గుర్తింపు కార్డు కొరకు ఆధార్, పాన్, ఓటరు కార్డులలో ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. FASTag ధర వాహనాన్ని బట్టి మారుతుంది. అన్ని టోల్ గేట్ కేంద్రాల్లో వీటి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రూ.100 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. 5 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి నగదు రూపంలో చెల్లింపుకు పరిమిత సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. FASTag ని ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు చేపట్టింది.

Similar News