కొన్ని విషయాలు మనసులోనే ఉంచుకోవాలి. అది నిజమని తెలిసినా అబద్దం చెప్పక తప్పని పరిస్థితి. కానీ నటి నిత్యా మీనన్ మాత్రం అలా కాదు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఉంటుంది తన ధోరణి. తాజాగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు, ఒక వెబ్ సిరీస్ వస్తోంది. వెబ్ సిరీస్ ది క్వీన్ పేరుతో గౌతమ్ మీనన్ రూపొందిస్తుండగా జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక విజయ్ దర్శకత్వంలో వస్తున్న తలైవి సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజై పలు విమర్శలను ఎదుర్కుంటోంది.
మరో చిత్రం ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీనికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తుండగా నిత్యామీనన్ జయలలిత పాత్రలో కనిపించనుంది. ఇంకా షూటింగ్ కూడా మొదలవని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదల చేశారు. ఆ ఫోటో అచ్చంగా జయలలితను గుర్తు చేస్తున్నా.. ఇది నిజం కాదు ఫోటోను మార్ఫింగ్ చేశారంటూ విమర్శలు వినిపించాయి. అయితే తలైవి చిత్ర ఫస్ట్ లుక్‌ని చూసిన నిత్య.. ఈ పాత్ర చేయడానికి తానే కరెక్ట్ అని చెబుతోంది. జయలలిత మాదిరిగానే నచ్చని విషయాలను మొహం మీద చెప్పడానికి ఏ మాత్రం సంకోచించనని అంటోంది. ఐరన్ లేడీ పాత్ర కోసం జయలలిత గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అంటోంది. ఆమెలా నటనలో జీవించడానికి తనను తాను తయారు చేసుకుంటున్నానని చెప్పింది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తానని నిత్యా మీనన్ చెబుతోంది.