ఎంజే మార్కెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు జీహెచ్ఎంసీ చర్యలు

Update: 2019-11-27 03:27 GMT

ఒకప్పుడు నిజాం నవాబుల దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మొజంజాహి మార్కెట్ ఇప్పుడు తాగుబోతులకు అడ్డాగా, శునకాలకు ఆవాసంగా మారింది. అంతే కాదు అక్కడ అడుగు పెడితే అంతా కంపే. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎంజే మార్కెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

నిజాం కాలంలో కట్టిన ఎన్నో అద్భుత కట్టడాలు.. నాటి పాలకుల దూరదృష్టికి ఇప్పటికీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయడం కోసం 1912లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్.. మోజం బహదూర్‌ అధ్యక్షతన సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు(సీఐబీ) ఏర్పాటు చేసారు. సిటీ ఇంప్రుమెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే నాంపల్లి రైల్వే స్టేషన్ ,CPO, ఉస్మాన్ గంజ్ మార్గాల కూడలిలో మొజంజాహి మార్కెట్‌ త్రిభుజాకారంలో నిర్మాణమైంది. పాత బస్తీకి, కొత్త నగరానికి అందుబాటులో ఉండేలా M. J. మార్కెట్ ను అప్పటి పాలకులు నగరం మధ్యలో ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించారు.

చార్మినార్‌ పరిసర ప్రాంతంలోని మహబూబ్‌చౌక్‌ బజార్‌, రెసిడెన్సీ బజార్‌, బేగంబజార్‌లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో 1935లో ఉస్మాన్ అలీఖాన్ త‌న రెండ‌వ కుమారుడైన న‌వాబ్ మొజాంజాహి బహదూర్ పేరుతో మొజంజాహి మార్కెట్‌ నిర్మించాడు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120షాపుల‌తో నిర్మించిన M.J. మార్కెట్ పాత బ‌స్తీ, కొత్త బ‌స్తీల‌కు వారదిగా ఉండేది. హైకోర్టు, ఉస్మానియా ఆసుప‌త్రి, సిటీ క‌ళాశాల తరహాలోనే మొజంజాహీ మార్కెట్ నిర్మాణ శైలి కూడా కనిపిస్తుంది. నిజాం పాలకులు, అధికారులు ఇక్కడి దుకాణాల్లో విరివిగా దొరికే ముందుగుండు సామగ్రిని కొనుగోలు చేసి అడవుల్లో వేటకు వెళ్లేవారు.

1947 వ‌ర‌కు M.J.మార్కెట్ ప్రముఖ పాన్ బ‌జార్‌గా పేరు పొందింది. ఇక్కడ దొర‌క‌ని పాన్ వెరైటీలు ఉండవంటే అతిశయోక్తి కాదు. కాల క్రమంలో M.J. మార్కెట్ కూరగాయలు, మాంసం, పండ్లు, పూల దుకాణాలతోపాటు అత్తరు, స్వీట్స్‌, ఐస్ క్రీమ్ షాపులు ఇలా వివిధ రకాల వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆ తర్వాత M. J. మార్కెట్ ప్రముఖ పాన్ మార్కెట్‌గా, పూల్ మార్కెట్‌గా, పండ్ల మార్కెట్ గా రూపాంతరం చెందింది. 1980లో పండ్ల మార్కెట్‌ కొత్త పేటకు, 2009లో పూల మార్కెట్ గుడిమల్కాపూర్ కు తరలిపొయాయి. ప్రస్తుతం ఉన్న M. J. మార్కెట్ GHMC నిర్వహణలో ఉంది.

చరిత్ర ఘనంగానే ఉన్నా దుకాణాల లీజుదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అద్భుత M.J. మార్కెట్ నిర్మాణానికి నష్టం కలిగించారు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా పై నుంచి నీరు కారుతోంది. పై పెచ్చులు ఊడి పడటం, సీలింగ్‌ దెబ్బతినడంతో నిర్మాణం రూపురేఖలే మారిపోయాయి.

ఇక దుకాణాల పేర్లతో ఏర్పాటైన బోర్డులు, మేకులు, ఇనుప రాడ్లతో మార్కెట్ అందం పూర్తిగా దెబ్బతింది. అంతేకాదు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో మురుగునీరు ఏరులై పారుతోంది. దీంతో ఇక్కడ అడుగు తీసి అడుగు వేయాలన్నా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. దీంతోపాటు ఈ ప్రాంతం తాగుబోతులకు అడ్డాగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా తయారైంది.

ఎంతో చరిత్ర ఉన్న ఈ మార్కెట్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో అధికారులు చర్యలు మొదలు పెట్టారు. భవిష్యత్తులోనూ మొజంజాహి మార్కెట్‌కు ప్రముఖ స్థానం కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఈ అద్భుత నిర్మాణానికి మరమ్మతులు చేపట్టి సరికొత్త హంగులు కల్పించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మార్కెట్‌ను దత్తత తీసుకున్నారు. నిజాం కాలం నాటి అందాలను తెచ్చేలా అన్ని ఏర్పాట్లతో ముందుకెళ్తున్నామని అరవింద్ కుమార్ తెలిపారు.

ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ ఎంజే మార్కెట్‌ను స్వయంగా పరిశీలించారు. మార్కెట్‌ మొత్తం కలియ తిరిగి చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. మార్కెట్‌లోని వ్యాపారులతో చర్చించారు. ప్రస్తుత మార్కెట్‌ దుస్థితిని తెలిపే చిత్రాలను దగ్గరుంచుకుని.. అభివృద్ధి పనులయ్యాక వ్యత్యాసం చూస్తానని అరవింద్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మంత్రి ఆదేశాలతో 10 కోట్ల రూపాయలతో మొజంజాహీ మార్కెట్ పునరుద్ధరణ ప‌నుల‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్‌పై లేజర్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లేజర్‌ షో చూపరులను కట్టిపడేస్తోంది.

ఇక నిర్వహణ లోపం ఎక్కడా కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో దుకాణదారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఆక్రమణల వల్ల మార్కెట్‌ తన పూర్వ వైభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో వాటిని తొలగించి మినార్లకు కొత్త రంగులు అద్దారు. అంతేకాదు, పావురాల వల్ల మార్కెట్‌ కళ చెదిరిపోతుండటంతో వాటిని పట్టుకుని అడవుల్లో వదిలే పనిలో పడ్డారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.

8 దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న ఈ ఎంజే మార్కెట్‌ జీహెచ్‌ఎంసీ పుణ్యమా అని పునర్‌ వైభవం సంతరించుకుంటోంది. జీహెచ్‌ఎంసీ చర్యలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News