పార్లమెంటులో సాధ్వీ ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గాడ్సే దేశభక్తుడు అంటూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. బీజేపీ సిద్ధాంతం ఇదేనా అంటూ విపక్షాలు దాడిచేశాయి. గాంధీ సంకల్పయాత్రలు చేసిన బీజేపీ మంత్రులు, ఎంపీల మనసులో మాట ఇదేనని.. గాంధీ కంటే గాడ్సేనే వారికి ఎక్కువ అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
సాధ్వి ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిన కేంద్ర ప్రభుత్వం, అటు బీజేపీ నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పార్లమెంటు రికార్డుల్లో తొలగించినట్టు స్పీకర్ ప్రకటించారు. అటు రక్షణశాఖ సలహా సంఘం నుంచి ఆమెను తొలగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు రాకుండా అమెపై పార్టీ నిషేధం విధించింది. అంతేకాదు.. పద్దతి మార్చుకోకపోతే పార్టీ నుంచి నుంచి బహిష్కరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సాధ్వి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని... ఆమె వ్యక్తిగతమని పార్టీ స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.