రాజధానిపై రాజకీయ దుమారం..

Update: 2019-11-29 02:32 GMT

ఆంధ్రుల రాజధాని అమరావతిపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతోంది. అమరావతిలో అన్ని గ్రాఫిక్సే అంటోంది వైసీపీ. అంతేకాదు ఓ వీడియో విడుదల చేసి ఇదా రాజధాని అభివృద్ధి అని ప్రశ్నించింది. అటు టీడీపీ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయింది. వైసీసీ వీడియో విమర్శలకు కౌంటర్ వీడియోను విడుదల చేసింది.

అమరావతి అభివృద్ధిపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల స్థాయి మాటల పరిధి దాటింది. వీడియోలతో విమర్శలకు దిగుతున్నారు వైసీపీ, టీడీపీ నేతలు. అదిగో రాజధాని నిర్మాణాలు అని టీడీపీ, అవన్ని గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వీడియో క్లిప్పింగులు విడుదల చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో అసలు నిర్మాణాలే జరగలేదన్నది వైసీపీ మొదట నుంచి వినిపిస్తున్న విమర్శ. కేవలం నాలుగు బిల్డింగులు కట్టి.. హాలీవుడ్ ఫిలిం మేకర్లు కూడా సృష్టించలేని గ్రాఫిక్స్ ను చంద్రబాబు సృష్టించారని ఆరోపిస్తూ.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై ఓ వీడియో విడుదల చేశారు.

మంత్రి బుగ్గన ఆరోపణలకు టీడీపీ కూడా ధీటుగా రియాక్ట్ అయ్యింది. మంత్రి విడుదల చేసిన వీడియోకు కౌంటర్ వీడియో విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. అమరావతిలో నిర్మాణాలు గ్రాఫిక్స్ కాదని.. ఇదిగో సాక్ష్యాలు అంటూ రాజధాని నిర్మాణాలను చూపించారు.

మరోవైపు రాజధానిని శ్మశానంతో పోల్చటానికి కారణాలను వివరించారు మంత్రి బొత్స సత్యానారాయణ. పచ్చని పంట పొలాలను చంద్రబాబు రాజధాని పేరుతో నిరుపయోగంగా మార్చారని.. అందువల్లే తాను శ్మశానంతో పోల్చానని అన్నారు. అమరావతిలో టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించిందని మరోసారి విమర్శించారు. నాలుగు బిల్డింగులు అవి కూడా నిర్మాణం పూర్తిగాని బిల్డింగులేనని అన్నారు.

ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దటమే లక్ష్యమని టీడీపీ మొదట నుంచి చెబుతోంది. అందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాక నిర్మాణాలను చేపట్టింది. ఈ నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయన్నది టీడీపీ వాదన. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు పర్యటనలు కూడా చేశారు.

Similar News