ప్రాణహితలో గల్లంతైన ఫారెస్ట్ బీట్‌ అధికారుల మృతదేహాలు లభ్యం

Update: 2019-12-02 07:47 GMT

ఆసిఫాబాద్‌ జిల్లా జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో గల్లంతైన అటవీ అధికారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నదిలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులక వలలకు అధికారుల డెడ్‌ బాడీలు చిక్కాయి. ఫారెస్ట్ బీట్‌ అధికారులు సురేష్, బాలకృష్ణ మృతదేహాలు లభించడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందరిని కన్నీరు పెట్టించాయి. కొత్తగా ఉద్యోగాలలో చేరిన యువ అధికారుల ఇండ్లలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

కలప అక్రమ తరలింపు సమాచారంతో మహారాష్ట్ర అహెరికి వెళ్లి .. తిరుగు ప్రయాణంలో అక్కడ పెద్ద పడవ అందుబాటులో లేకపోవడంతో చేపలకు ఉపయోగించే చిన్న పడవ ద్వారా నదిని దాటేందుకు ప్రయత్నించారు. నదిలో కొంత దూరం రాగానే పడవ బొల్తాపడింది. పడవలో ఉన్న ఆరుగురులో నలుగురు అతి కష్టం మీద నదిలోని చిన్న చెట్లను ఆధారంగా ప్రాణాలతో బయటపడ్డారు. బీట్‌ అధికారులు బాలకృష్ణ, సురేష్ నీటిలో కొట్టుకుపోయారు. ఆదివారం రాత్రి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గజ ఈతగాళ్లు గాలించినా మృతదేహాలు లభ్యం కాలేదు. సోమవారం ఉదయం మత్య్స కారుల చేపల వలకు మృత దేహాలు చిక్కాయి.