పవన్ వర్సెస్ వైసీపీతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రభుత్వంపై మరింత దూకుడు పెంచిన పవన్.. జగన్ పై విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. అటు మంత్రులు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఈ విమర్శలు వ్యక్తిగత అంశాల వరకు వెళ్లటంతో రెండు పార్టీల మాటల యుద్ధం తీవ్రమవుతోంది.
ఏపీ ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇస్తామని.. ఆ తర్వాత వైఫల్యాలపై పోరాడుతామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జరుగుతున్న పరిణామాలతో ముందుగానే తన విమర్శల స్వరాన్ని పెంచారు. అపోజిషన్ స్టాండ్ నుంచి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తాము ముందుగానే పోరాట బరిలోకి దిగామన్న జనసేనాని.. జనంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు. జిల్లాల పర్యటనలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, వైఫల్యాలపై కాకుండా డైరెక్ట్ గా జగన్ నే టార్గెట్ చేస్తూ విమర్శల డోస్ పెంచారు.
రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. తొలి రోజు నుంచి డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. మతం, కులంపై విమర్శలకు జగన్ కౌంటర్ ఇస్తే.. పవన్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి పర్యటనలో కార్యకర్తలు, న్యాయవాదులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం నిర్వహించిన జనసేనాని.. ఈ ఆర్నెల్లలో ప్రభుత్వం సాధించిందేంటని నిలదీశారు.
దీంతో మంత్రులు జనసేనానిపై ముప్పేట దాడికి దిగారు. తాము పవన్ ని.. పవన్ నాయుడు అనే పిలుస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఆడించినట్లు పవన్ ఆడుతున్నారని ఆరోపించారు. మంత్రుల విమర్శలకు పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. చట్టాలు చేయాల్సిన మంత్రులు బూతులు మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు. ఈనాటి రాజకీయాలకు మోదీ, అమిత్ షాలే కరెక్ట్ అంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు.
బీజేపీపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై మరోసారి వైసీసీ విమర్శలకు పని చెప్పింది. జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్ షా చెప్పి ఉంటారని, అందుకే అమిత్ షా కరెక్ట్ అని అంటున్నారని ఎదురుదాడికి దిగారు మంత్రులు. మొత్తంగా పవన్ దూకుడు, మంత్రుల కౌంటర్లతో ఏపీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.