చంద్రబాబు అమరావతి పర్యటనలో జరిగిన దాడి ఘటనను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుపుతోంది. ఈ విచారణ కొనసాగుతుండగానే టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటు తమ ఫిర్యాదుపై గవర్నర్ స్పందన సంతృప్తినిచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య లాఠీ యుద్ధం నడుస్తోంది. గతనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పడుతున్న టీడీపీ నేతలు దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, అధికార పక్షం ప్రత్యారోపణలు ఓ వైపు కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంపై సిట్ కూడా విచారణ జరుపుతోంది. తాజాగా ఈ ఎపిసోడ్ రాజ్‌భవన్‌కు చేరింది.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ రోజు జరిగిన ఘటనను వివరించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు కుట్రతోనే చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి జరిగిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలతోనే వైసీపీ దాడి చేయించిందన్నారు. చంద్రబాబు పర్యటనలో వాడిన బస్సును సీజ్ చేసి డ్రైవర్, కండక్టర్‌లను అదుపులో తీసుకున్నారన్నారన్నారు. వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కక్షసాధింపే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు.
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై పడ్డ లాఠీ ఎవరిదో డీజీపీ సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఘటనపై డీజీపీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయన్నారు. పర్యటన కోసం తీసుకున్న అద్దె బస్సును సీజ్ చేయడంపైనా వారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై వేసిన సిట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గవర్నర్ వాస్తవాలు గ్రహించారని.. తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు చెప్పారు. గవర్నర్ స్పందన తమకు సంతృప్తినిచ్చిందని తెలిపారు.