విశాఖపట్నంలో యువతిపై యాసిడ్ దాడిలో పోలీసులు పురోగతి సాధించారు. హైదరాబాద్ నుంచి ఓ ఫంక్షన్ కోసం బుధవారం 30 ఏళ్ల శిరీష విశాఖపట్నం వచ్చింది. గాజువాకలోని సమతా నగర్‌లో ఆమె ఒంటరిగా నడిచి వెళ్తుండగా.. యాసిడ్ దాడి చేయడంతో 30 శాతానికిపైగా శరీరం కాలిపోయింది. ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఉంటున్న శిరీష తన ఆడపడుచు శ్రావ్యశ్రీ ఇంటికి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ప్రీతి అనే మహిళ శిరీష్‌పై యాసిడ్‌తో దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది అనే కోపంతోనే ఈ దాడి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన గంటల వ్యవధిలోనే యాసిడ్ దాడి జరగడంపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని శిరీష కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరిపైన అయినా అనుమానం ఉందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.