తీవ్ర నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు.. అమిత్ షా అభిప్రాయం

Update: 2019-12-09 01:01 GMT

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో..ఈ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ అదే స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇన్ స్టంట్ జస్టిస్ తో కొందరు పోలీసులకు జేజేలు పలికితే.. మరికొందరు మాత్రం వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ఎన్ కౌంటర్ కు అసలు కారణమని విశ్లేషణలు చేశారు. అవును. అదే నిజం. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్. సరైన సమయంలో జరిగని న్యాయం అన్యాయంతోనే సమానం. అదే జనంలో ఆక్రోషం నింపింది. ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది.

ఈ ఘటన కేంద్రంలో కదలిక తీసుకొచ్చింది. అత్యాచారం తరహా తీవ్రమైన కేసుల్లోనూ న్యాయం ఆలస్యం అయితే ఎన్ కౌంటర్ తరహా డిమాండ్లే వినిపిస్తాయి. దీంతో హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్ పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్రం ప్రకటించింది. పుణెలో నిర్వహించిన 54వ డీజీపీ, ఐజీపీల సదస్సుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా హత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాల్సిన విషయాన్ని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

తీవ్రమైన కేసుల్లో విచారణ వేగంగా జరిగేందుకు ఇప్పటికే 1023 ఫాస్ట్ ట్రాక్ లను ప్రారంభించబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు ప్రతి రాష్ట్రంలో అనుబంధ కళాశాలలతో పాటు ఆల్ ఇండియా పోలీస్ యూనివర్శిటీ, ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఒక తాటిపైకి వచ్చి జాతీయ భద్రతకు తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలియజేయాలని కోరారు అమిత్ షా. కేంద్రం ఆలోచనలు అమల్లోకి వస్తే ప్రజలు కోరుకునే సత్వర న్యాయం కోర్టుల ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి.

Similar News