వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు : చంద్రబాబు

Update: 2019-12-10 02:31 GMT

ఏపీలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల అమలులో సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఉల్లి కోసం ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పులు బయటపడతాయనే అసెంబ్లీ సమావేశాల్ని చూపించకుండా ఛానెళ్లపై నిషేధం విధించారని విమర్శించారు.

ఏపీలో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు మహిళలపై దాడులు చేస్తున్నారు మండిపడ్డారు. మహిళల భద్రతపై బిల్లు పెట్టామని చెబుతున్నారని, బిల్లుకు, చర్చకు కూడా తేడా తెలియకుండా ప్రభుత్వం అసెంబ్లీ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు . చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ఆరు నెలల్లో మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయని అన్నారు.

దిశ సంఘటన సత్వర న్యాయం అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరికి ఇది కనువిప్పు కావాలన్నారు. బాధితులకు న్యాయం కోసం ప్రజల్లో ఉన్న ఆరాటాన్ని ప్రతిఫలింపజేసిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఉల్లి ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీళ్లు ఇచ్చే కిలో ఉల్లి కోసం రోజంతా లైన్లో నిలబడాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. గుడివాడలో ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి సాంబయ్య అనే వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. సాంబయ్య మృతిపై ప్రభుత్వం కనీసం స్పందించలేదని, ఉల్లి పంపిణీలో విఫలమయ్యారు దుయ్యబట్టారు.

అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీపీఏలపై తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం తమకు మైక్‌ ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు.. అసెంబ్లీ సమావేశాల్ని చూపించకుండా ఛానెళ్లపై నిషేధం విధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని మీడియా గొంతు నొక్కె ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.

సభా సంప్రదాయాలను వైసీపీ సభ్యులు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు . సభాపతి తమ విషయంలో అతిగా జ్యోకం చేసుకుంటూ అధికార పక్షం పట్ల మౌనం వహించడం తగదన్నారు.

Similar News