ఇస్రో PSLV-C48తో అంతరిక్ష రేసులో మరో కీలక మైలురాయిని అధిగమించింది. రీశాట్–2BR-1 శాటిలైట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రస్తుత ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపిన రీశాట్–2BR-1 జీవిత కాలం 5 ఏళ్లు.. ఇది నిఘానేత్రంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇస్రో రిశాట్ సిరీస్‌లో కొన్ని శాటిలైట్లను ప్రయోగించింది. భారత సైన్యానికి కొన్ని ప్రదేశాల్లో నిరంతర నిఘా కోసం నాలుగు వరకు రిశాట్ సిరీస్ ఉపగ్రహాలు అవసరం. వీటిల్లోని ఎక్స్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ నుంచి స్పష్టమైన చిత్రాలు లభిస్తాయి. పగలు, రాత్రి, మేఘావృతమైన వాతావరణంలో కూడా మంచి ఫిల్టర్లను వినియోగించి నాణ్యమైన చిత్రాలను అందిస్తాయి.
షార్ నుంచి ఇది 75 వ ప్రయోగం కాగా..PSLV రాకెట్ ద్వారా 50 ప్రయోగం. PSLV సీ-48 సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇది చారిత్రాత్మక ప్రయోగం అన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్.
PSLV రాకెట్ ఇస్రోకు రామబాణం లాంటిది. రెండు ఫెయిల్యూర్లు తప్పితే.. అన్నీ అదరగొట్టాయి. దేశ ప్రతిష్టను పెంచడంతో పాటు.. ఇస్రోకు కాసులు కురిపించాయి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌తో చాలా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది ఇస్రో. 2008 అక్టోబరు 22న పీఎస్‌ఎల్‌వీ-C11 ద్వారా చంద్రయాన్-1ని ప్రయోగించారు. 2013 నవంబరు 5న జరిగిన మంగళ్‌యాన్ కూడా PSLV-C25 ద్వారానే నింగిలోకి పంపారు. ఇక PSLV -C37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సాధించారు. వాణిజ్య పరంగా కూడా PSLV సూపర్ సక్సెస్..ఇప్పటివరకు 310 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం ద్వారా రికార్డు సృష్టించింది ఇస్రో.
PSLV సీ-48 ద్వారా అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్ లకు చెందిన ఒక్కోఉపగ్రహాన్ని ప్రయోగించారు..ఇప్పటి వరకు ఇస్రోకు అతిపెద్ద కస్టమర్ అమెరికానే! ఆ దేశానికి చెందిన 233 చిన్న ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది ఇస్రో.