అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు, మార్షల్స్ మధ్య గొడవపై శుక్రవారం సభలో పెనుదుమారం చెలరేగింది. సభలోకి వస్తుంటే గేట్లు మూసేసి తమను అడ్డుకున్నారని TDP సభ్యులు చెప్తుంటే.. మార్షల్స్‌పై దాడి చేసింది తెలుగుదేశం MLAలు, MLCలేనని అధికారపక్షం వీడియో ప్లే చేసి చూపించింది. మార్షల్స్‌ను దూషిస్తూ, వారిపై దాడి చేయడం అత్యంత దారుణమని YCP మంత్రులు, సభ్యులు మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా స్పీకర్ తీసుకునే యాక్షన్ కఠినంగా ఉండాలన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు.
CM జగన్ సైతం చంద్రబాబు సహా TDP సభ్యుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించారనడానికి ఈ వీడియోలే నిదర్శనమన్నారు. గేట్ నెంబర్ 2 నుంచి వచ్చే అవకాశం వదిలేసి వేరే గేట్ ద్వారా సభలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశారు. మార్షల్స్ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తుంటే.. వాళ్లను పట్టుకుని బూతులు తిట్టడం ఏంటని నిలదీశారు. ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారో క్లిప్పింగ్స్‌లో కనిపిస్తోందన్నారు జగన్.
ఉదయం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచే మార్షల్స్ అంశం సభను కుదిపేసింది. ప్రతిపక్ష నాయకుడే సభా మర్యాద మర్చిపోయారంటూ మంత్రి పేర్ని నాని కొన్ని ఫోటోలు ప్రదర్శించారు. మార్షల్స్‌ను టీడీపీ సభ్యులు తిట్టారు, గోళ్లతో రక్కారని అన్నారు. ఐతే.. దీనికి TDP కౌంటర్ ఇచ్చింది. అవన్నీ గ్రాఫిక్స్ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. గ్రాఫిక్స్ అలవాటు అయిన వాళ్లకు అన్నీ గ్రాఫిక్స్‌లాగే కనిపిస్తాయంటూ పేర్ని నాని కూడా దీటుగా బదులిచ్చారు. మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించిన వారు క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. టీడీపీ MLAలు మాత్రం తప్పంతా మార్షల్స్‌దేనన్నారు. అసెంబ్లీకి వస్తున్న తమను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని నిమ్మల రామానాయుడు నిలదీశారు. ఈ వాదనను మంత్రి కొడాలి నాని ఖండించారు. గురువారం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అలా వ్యవహరించారన్నారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టి మరీ చర్యలు తీసుకోవాలని YCP ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు. దీనిపై TDP శాసనసభ్యుడు బుచ్చయ్య కూడా అదే స్థాయిలో మాట్లాడారు. ఏకపక్షంగా సస్పెండ్ చేస్తామంటే చేసుకోండని అన్నారు. సభ బయట జరిగే ఘటనలకు, అసెంబ్లీకి ముడి పెట్టకూడదని బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎన్నో అన్నారని గుర్తు చేశారు. హక్కుల గురించే తాము అడుగుతున్నామన్నారు.