ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చజరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. మున్సిపల్ స్కూళ్లలో తమ పాలనలో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెడితే మీరు వ్యతిరేకించలేదా? అంటూ సాక్షిలో వచ్చిన కథనాలు ప్రతిపక్షనేత చంద్రబాబు బయటపెట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం వద్దని తాను ఎప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఢీ అంటే ఢీ అంటూ అధికార, విపక్షాల సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలాయి. సీఎం జగన్-ప్రతిపక్ష నేత చంద్రబాబుల విమర్శ, ప్రతి విమర్శలతో అసెంబ్లీ వేడెక్కింది. ఇంగ్లీష్ మీడియానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ తెలుగు భాషను నిర్వర్యం చేయవద్దని హితవు పలికారు.
టీడీపీ హయాంలో ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టినట్టు సభ దృష్టికి చంద్రబాబు తీసుకువచ్చారు. మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెడితే మీరు వ్యతిరేకించలేదా? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ పై వైసీపీ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు సీఎం జగన్. ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంతో విద్యారంగంలో రివెల్యూషన్ మొదలవుతుందన్నారు. ఉద్యోగాలు రావాలన్నా.. ఉద్యోగంలో విలువ పెరగాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరని జగన్ చెప్పారు.
అటు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియానికి టీడీపీ సహకరిస్తుందన్న చంద్రబాబు.. భాష ఒక్క విషయంలోనే దృష్టి పెడితే సరిపోదని.. విజ్ఞానం కూడా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. తెలుగుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని.. ఆ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదన్నారు. మాతృభాషను త్యాగం చేసే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు.