అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ - TDP సభ్యుల గొడవ వివాదంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని ఇక్కడితో ముగించాలంటే జరిగిన దానిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయాలన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభ మర్యాద కాపాడేందుకు అంతా సహకరించాలని కోరారు. ఐతే, TDP సభ్యుల తీరును ఆక్షేపిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాల్సిందేనని YCP సభ్యులు పదేపదే డిమాండ్ చేశారు. దీనికి తెలుగుదేశం సభ్యులు గట్టిగానే సమాధానం చెప్పారు. అసెంబ్లీలోకి రాకుండా తనను అడ్డుకున్న దానికి, గతంలో తనకు జరిగిన అవమానాలకు ఎవరు విచారం వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. దీంతో.. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కి కట్టబెడుతూ తీర్మానం పెట్టారు. దీన్ని YCP సభ్యులంతా బలపరిచారు. ఈ తీర్మానం సభ ఆమోదం పొందడంతో దీనిపై సభాపతి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది.