అక్కకు పెళ్లవుతుందంటే చెల్లికి ఎంతో సరదా.. కాబోయే బావగార్ని కాసేపు ఆటపట్టించాలని సరదా పడుతుంది మరదలు పిల్ల. కొన్ని పెళ్లిలలో అది ఆచారం కూడా. బావగారు మరదలి ముచ్చటను తీర్చేస్తారు. అడిగినంతా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ పెళ్లిలో జరిగిన ఆ కార్యక్రమం పెళ్లినే ఆపేసింది. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్‌కు చెందిన వివేక్ కుమార్ వివాహం పట్టణానికి చెందిన ఓ యువతితో నిశ్చయమైంది. కట్నకానుకలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పూర్తయ్యాయి. పందిట్లోకి వచ్చిన పెళ్లి కొడుక్కి నీళ్లిచ్చారు కాళ్లు కడుక్కోమని.
ఈలోపు 'జూతా చురాయి' అనే ఆచారం ప్రకారం మరదలు బావ చెప్పులు దాచి పెట్టింది. డబ్బులు ఇస్తేనే మీ చెప్పులు ఇస్తానంటూ కళ్యాణ మంటపం చుట్టూ అతడిని తిప్పింది. వివేక్‌కి ఈ పద్దతి ఏ మాత్రం నచ్చలేదు. చెప్పులు ఇవ్వమంటూ మరదలిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక్కసారిగా షాకైన మరదలు.. అయ్యో బావగారు ఇదంతా సరదాగా చేశాను.. అంత కోపం ఎందుకండీ.. అనేసి లోపలికి వెళ్లి అక్కకి చెప్పింది. బంధువులంతా వచ్చి ఏదో చిన్న పిల్ల ఆటపట్టిస్తే అలా అరుస్తావెందుకయ్యా అని అన్నారు.
ఇంతలో పెళ్లి కూతురు బయటకు వచ్చి నాకీ పెళ్లి వద్దు అని అరిచింది. చిన్న విషయానికే సీరియస్ అయ్యే మొగుడితో నేనెలా కాపురం చేసేది. పెళ్లయ్యాక ఇంకెన్ని ఇబ్బందులు పెడతాడో ఆయనగారి కోపంతో అని అనేసరికి పెద్దవాళ్లు కూడా నిజమే కదా అని పెళ్లి కూతురికే సపోర్ట్ చేశారు. రూ.10 లక్షల కట్నం కూడా తిరిగి ఇచ్చేందుకు పెద్దమనుషుల మద్య ఒప్పందం కుదుర్చుకున్నారు అమ్మాయి తరపు వారు. పీటల మీది పెళ్లి ఆగిపోయిందన్న బాధ కంటే ఇలాంటి వాడితో పెళ్లి అవకపోవడమే మంచిది అని ఊపిరి పీల్చుకుంది పెళ్లి కూతురు.