రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీ, తెలంగాణ మధ్య పలు అంశాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. అందులో విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకం కూడా ఒకటి. విభజన తర్వాత ఏపీ స్థానికత గల 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేశారు. వీరిని చేర్చుకోవడానికి ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించారు. దీంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. ఈ వివాదంపై కమిటీ గత 9 నెలల పాటు విచారణ జరుపుతోంది. శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం అయింది. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో... తుది ఆదేశాలేమీ ఇవ్వకుండానే విచారణ ముగించారు జస్టిస్ ధర్మాధికారి. వారంలోగా తుది నివేదికను సుప్రీంకోర్టుకు, రెండు రాష్ట్రాలకు ఇస్తామని స్పష్టం చేశారు.
1157 మందిలో 613 మంది ఏపీలోనే చేరతామని ఆప్షన్ ఇచ్చారు. వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో తిరిగి చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని తెలంగాణ అధికారులు రాతపూర్వకంగా తెలిపారు. ఈ 1157 మంది కాకుండా, ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళతామని ఆప్షన్ ఇచ్చారు. వీరిలోనూ సగం మందిని తీసుకుంటామని పేర్కొన్నాయి. కానీ 613 మందిని ఏపీలో చేర్చుకుంటేనే తాము మిగతా వారిని తీసుకుంటామని షరతు పెట్టాయి. అయితే ఈ ప్రతిపాదనలన్నింటినీ ఏపీ తిరస్కరించింది. దీంతో ఇక ఈ అంశంపై విచారణ ముగిసిందని, తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి ప్రకటించారు. ఆయన ఇచ్చే తుది నివేదికలోని సిఫార్సులే సుప్రీంకోర్టు ఆదేశాలుగా త్వరలో వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది..
ఈ వివాదం కారణంగా...పదోన్నతులు ఆగిపోయాయని రెండు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉద్యోగుల పరస్పరం ఆరోపించుకుంటున్నారు.. వివాదాన్ని త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.. మొత్తానికి సమస్య పరిష్కారం కోసం సుప్రీం కోర్టు...నియమించిన..కమిటీ మళ్లీ అదే కోర్టుకు నివేదిక ఇస్తోంది. ఇక ఈ పంచాయితీని సుప్రీం కోర్టే తేల్చనుంది.