ఏపీలో ఆర్టీసీ కార్మికుల కల నెరవేరింది. 52 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ఆయన తెలిపారు. ఈ మేరకు.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం తీరును జగన్ విమర్శించారు. చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు.. ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1997లో చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.
అటు.. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలను చూసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే విలీన హామీని నెరవేర్చారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. 200 రోజుల్లో ఆర్టీసీని విలీనం చేసిన ఘనత జగన్‌కే దక్కిందని ప్రశంసించారు. మొత్తానికి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి.. కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో 52 వేల మంది ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.