ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆక్షేపించారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిపై సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు .. పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై తాజా పరిణామాలను చర్చించారు. సీఎం చేసిన ప్రకటన మైండ్ గేమ్ లో భాగమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిపై తనకున్న కోపాన్ని జగన్ ఈవిధంగా తీర్చుకుంటున్నారని ఆక్షేపించారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ రాజధాని విషయంలో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అమరావతి రాజధానిగా ప్రకటించిన రోజే శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. ప్రతి జిల్లాకు ఓ ప్రణాళిక రూపొందించి దానికనుగుణంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారో ఏ సందర్భంలో మాట్లాడారో ఆయనే సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారాయన. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారని ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారని నిలదీశారు? ఇది తుగ్లక్ పాలన అంటూ విమర్శించారు.
ప్రభుత్వ తీరు చూస్తుంటే జిల్లాకో ఆఫీసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మూడు రాజధానుల్లో మంత్రులను ఏ రాజధానిలో పెడతారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం ప్రకటనతో ప్రాంతీయ విబేధాలు వస్తాయన్న చంద్రబాబు.. రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతి ఉండాలనేదే టీడీపీ వైఖరి అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తాము కోరుకుంటున్నాం అని చెప్పారాయన. కేపిటల్ విషయంలో సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
అటు.. విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే ఛాన్సుందన్న సీఎం జగన్ ప్రకటనను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం మంచి నిర్ణయమన్నారు. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ ఉన్న విశాఖ.. పరిపాలనా నగరంగా అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతుందన్నారు. పరిపాలనా కేంద్రంగా విశాఖ విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమన్నారు గంటా.
మరోవైపు.. అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు మాత్రం బీజేపీ వ్యతిరేకమన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిలోనే సీడ్ క్యాపిటల్ ఉండాలని చెప్పారు. హైకోర్టు రాయలసీమలో పెట్టాలని బీజేపీ మ్యానీఫెస్టోలోనే పెట్టామని కన్నా తెలిపారు. హైకోర్టు రాయలసీమలో పెడితే అమరావతిలో హైకోర్టు బెంచ్ పెట్టాలని సూచించారు. వైసీపీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు.