జగన్ నిర్ణయాలతో 64 మంది ప్రాణాలు కోల్పోయారు: టీడీపీ

Update: 2019-12-18 07:51 GMT

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు నిర్మించే అవకాశం ఉందని సీఎం జగన్ ప్రకటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజధాని అమరావతిని మార్చాలని చూస్తే వైసీపీ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుందని గుంటూరు టీడీపీ నాయకులు అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో రాజధానిని మార్చాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు అప్పగిస్తే.. ఇప్పుడా ప్రాంతాన్ని స్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు 64 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పటికైనా అమరావతి రాజధానిపై స్పష్టమైన విధానం తీసుకుని అభివృద్ధి చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

అమరావతిలో రాజధాని నిర్మించడం చేతగాక పోతే తప్పుకోవాలన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు. సీఎం జగన్‌ 3 రాజధానుల ప్రకటనపై ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై కోపంతోనే అమరావతి, పోలవరంపై కక్ష సాధింపులకు దిగారన్నారు. ప్రజలతో కలిసి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.

ఇన్నాళ్లు కుల మతాల మధ్య వైసీపీ నేతలు చిచ్చు పెట్టారని.. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రాజేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సీఎం జగన్ తన బ్రాండ్‌ను ప్రజలు గుర్తు పెట్టుకునేందుకు వినాశకర పంథాను ఎంచుకున్నారని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు బుద్దా వెంకన్న. రాజధానిపై జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో భయాందోళన నెలకొందని అన్నారాయన.

Similar News