ఏపీలో 3 రాజధానుల ప్రతిపాదన అనాలోచిత నిర్ణయమన్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని చెప్తూనే.. ఇప్పుడు విశాఖలో రాజధాని అంటే ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు. అదే అమరావతి అయితే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టు ఇవ్వడం సంతోషమని ఐతే.. పాలనా వ్యవహారాల విషయంలో రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఆంధ్రుల రాజధాని షెటిల్ సర్వీస్‌లా మారితే ఎలాగన్నారు.
జగన్ హైదరాబాద్‌లో తన ఆస్తులు కాపాడుకునేందుకే.. రాజధాని అమరావతిని ముక్కలు చేశారని యనమల అన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తాము చెప్తున్న విషయాల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు యనమల. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతి రాజధానిగా అన్నివర్గాలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. జగన్ నిర్ణయం ప్రభావం పాలనపై తీవ్రంగా ఉంటుందని అన్నారు.