పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. భూములు వెనక్కి ఇస్తామన్న విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదన్నారు. సీఎం ప్రకటనతో ఇప్పటికే సగం చచ్చిపోయామని.. మంత్రుల వ్యాఖ్యలతో తీవ్ర క్షోభకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో మహిళలు కన్నీరు పర్యంతమవుుతున్నారు. రైతులతో రాజకీయాలు చేయొద్దన్నారు. అమరావతిలో ఏ పార్టీ జెండా లేదు.. ఉన్నవి నల్లజెండాలేనంటున్నారు రాజధాని రైతులు.
మరోవైపు మూడు రాజధానుల ప్రకటనపై అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. రైతుల ఆందోళనలతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు వెలగపూడిలో రాజధాని రైతుల రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శనకు దిగారు. తమ త్యాగాలను అవమానించొద్దంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు.