రాజధానిపై శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి జీఎన్‌రావు కమిటీ నివేదిక అందనుంది. ఈ కమిటీ ప్రధానంగా ఏయే అంశాలు రిపోర్ట్‌లో ప్రస్తావిస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానులపై ఇప్పటికే సీఎం జగన్ అసెంబ్లీలో సూత్రప్రాయంగా కొన్ని విషయాలు ప్రస్తావించిన నేపథ్యంలో.. రిపోర్ట్‌లో దీనిపై ఎలాంటి స్పష్టత ఉంటుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. 3 రాజధానుల అంశంపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు ఉంటాయా? అసలు ఈ విషయంపై 13 జిల్లాల నుంచి కమిటీ ఎలాంటి అభిప్రాయ సేకరణ చేసింది అనేది కూడా మరికొద్ది గంటల్లో తెలియబోతోంది.
లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ క్యాపిటల్స్ ప్రతిపాదనపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమరావతిలోనే పాలన కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే.. 3 రాజధానుల ప్రతిపాదనపై అటు ఉత్తరాంధ్ర వాసులు, కర్నూలు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల మధ్య ఈ రకమైన విద్వేషాలు పెరగకుండా ఉండాలంటే ఇప్పుడు కమిటీ ఇచ్చే నివేదిక అత్యంత కీలకం అవుతోంది. మరి ఈ నివేదికలో ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికను జీఎన్ రావు కమిటీ సూచిస్తుందా? లేదా అనేది వేచి చూడాలి. అలాగే పాలన వికేంద్రీకరణ, అభిృవృద్ధి వికేంద్రీకరణపై ఎలాంటి సిఫార్సులుంటాయనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
రెండు రోజులుగా ఫైనల్ రిపోర్ట్ రెడీ చేయడంలో కమిటీ సభ్యులు తలముకనలై ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 3:30కి సీఎంను కలవనున్న GN రావు తుది నివేదిక అందచేస్తారు. ఇప్పటికే అందచేసిన మధ్యంతర నివేదిక ఆధారంగానే అసెంబ్లీలో సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటన చేశారని ప్రచారం జరుగుతోంది. మరిప్పుడు దానికి తుది రూపు ఇచ్చేలా ఫైనల్ రిపోర్ట్ అందుతుందా ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నివేదిక రూపకల్పనలో కమిటీ CRDA అధికారుల సహాయం తీసుకుంది. కొన్నాళ్లుగా కమిటీ సభ్యులతో కలిసి పనిచేసిన వాళ్లంతా దాన్నుంచి రిలీవ్ అయ్యి తమ రెగ్యులర్ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. ఏదేమైనా.. రాజధానిపై GN రావ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగాన నిర్ణయం ఉంటుందని పదేపదే ప్రభుత్వం ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. శుక్రవారం వచ్చే నివేదిక భవిష్యత్‌ను నిర్దేశించబోతోంది.