పాక్‌కి మరో షాక్.. భారత్‌కి కోర్టు ఖర్చులు చెల్లించాల్సిందే: బ్రిటన్ కోర్టు

Update: 2019-12-20 03:37 GMT

నిజాం నిధుల కేసులో పాకిస్థాన్‌కు మరో షాక్‌ తగిలింది. ఈ కేసులో భారత్‌కు కోర్టు ఖర్చులు చెల్లించాలంటూ ఆదేశించింది బ్రిటన్‌ హైకోర్టు. దేశ విభజన సమయంలో.. హైదరాబాద్ నిజాం లండన్‌ బ్యాంక్‌లోని డిపాజిట్‌ చేసిన నిధుల వివాదాన్ని ఇప్పటికే పరిష్కరించిన లండన్‌ హైకోర్టు.. ఇప్పుడు భారత్‌కు అనుకూలంగా మరో తీర్పు ఇచ్చింది. ఈ వ్యాజ్యానికి సంబందించి కోర్టు ఖర్చుల్లో 65 శాతం భారత్‌కు చెల్లించాలంటూ పాకిస్థాన్‌కు ఆదేశించింది. అంటే. ఇప్పుడు దాదాపు 26 కోట్లు పాకిస్థాన్‌ భారత్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే నిష్పత్తిలో నిజాం వారసులకు కూడా చెల్లించాలి.

నిజాంకు చెందిన దాదాపు 35 మిలియన్‌ పౌండ్లు.. లండన్‌లోని న్యాట్‌ వెస్ట్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. వీటిపై తమకు హక్కు కల్పించాలంటూ పాకిస్థాన్‌ దావా వేసింది. అయితే నిజాం వారసులు భారత్‌తో చేయి కలపి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వ్యాజ్యం నడిపారు. వాదోపవాదనలు విన్న బ్రిటన్‌ హైకోర్టు.. భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇదే కేసులో భారత్‌కు కోర్టు ఖర్చులు చెల్లించాలంటూ పాకిస్థాన్‌ను ఆదేశించింది బ్రిటన్‌ హైకోర్టు.