పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలు హింసా రూపం దాల్చాయి. మంగళూరులో చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సమయంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఇక, లక్నోలో మొబైల్ సేవలను నిలిపివేశారు. లక్నో కూడా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్ ను ఆపేశారు. గురువారం 12 గంటల నుంచి శుక్రవారం 12 గంటల వరకు కమ్యూనికేషన్ కట్ చేశారు.
మరోవైపు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో దాదాపు 1200 మంది ప్రజలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే బెంగళూరులో జరిగిన ఆందోళనల్లో చరిత్రకారుడు రామచంద్ర గుహ పాల్గొన్నారు. ఈయనను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో సీఏఏకు వ్యతిరేకంగాఎర్రకోట దగ్గర పలు సంఘాలు నిరసనలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో 144సెక్షన్‌ను విధించారు. ఢిల్లీలో 14 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. పలువురు విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండటంపై అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తారిక్ మన్సూర్ విచారం వ్యక్తం చేశారు. ఆందోళన కారులు శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలని సూచించారు. మరోవైపు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, ఆమ్ఆద్మీ ప్రభుత్వానికి, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అరెస్టుల నుంచి జామియా విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.
గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ లోనూ సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనలు అదుపుతప్పి హింసాత్మకంగా మారితే.. మరికొన్ని చోట్ల మాత్రం జాతీయవాద భావోద్వేగం కనిపించింది. కర్నాటకలో సూపర్ పోలీస్ సమర్ధతతో ఆందోళనకారులు జాతీయ గీతాన్ని ఆలపించి నిరసనను విరమించుకున్నారు. డీసీపీ చెతన్ సింగ్ రాథోడ్ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని సముదాయించారు.
అటు ఢిల్లీలోనూ ఇలాంటి భావోద్వేగ సన్నివేశమే కనిపించింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో ఆందోళనకారులు ‘సారే జహాసే అచ్చా.. హిందూస్థాన్ హమారా’’ అంటూ దేశభక్తి గేయం ఆలపించారు. వందలాది మంది ఢిల్లీ నడిబొడ్డున కొత్త చట్టంపై శాంతియుతంగా నిరసనలు తెలిపారు. త్రివర్ణ పతాకాలు చేతబట్టి వచ్చిన నిరసన కారులు సీఏఏని వెనక్కి తీసుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.