దేవుడిలా వచ్చి రక్షించాడు..

Update: 2019-12-28 08:34 GMT

ఆదుకునే మనసుండాలి కానీ అవతలి వారు ఏ కులమో ఏ మతమో మనకెందుకు. మంచి మనసు, మానవత్వం ఉంటే చాలు.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే సహృదయం ఉంటే ఏ దేవుడైనా సంతోషిస్తాడు. మనం పెట్టుకున్న పేర్లే.. మనం నిర్మించుకున్న ఆలయాలే.. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, జాలి, దయ చూపించమని చెబుతాయి ఏ గ్రంధాలైనా. అదే అక్షరాలా ఆచరించారు ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌కు చెందిన హాజీ ఖాదిర్ అనే వ్యక్తి.

ఇంట్లో కూర్చుని నమాజ్ చేసుకుంటున్న ఆయనకు బయట జరుగుతున్న అల్లర్లు చెవిన పడుతూనే ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి అక్కడ. నమాజు పూర్తి చేసుకున్న ఆయన అల్లాను ప్రార్థించారు. గొడవలు త్వరగా సద్దుమణిగేలా చూడు తండ్రీ అని. అనంతరం ఇంటి కిటికీలోనుంచి బయటకు చూశారు.

ఆందోళనకారులు సృష్టిస్తున్న విధ్వంసంలో పోలీస్ అధికారి అజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి సహాయం కోసం అర్థిస్తున్నారు. ఖాదిర్ వెంటనే బయటకు వెళ్లి గాయపడిన పోలీస్‌ని ఇంట్లోకి తీసుకువచ్చారు. డాక్టర్‌ని పిలిపించి వైద్యం చేయించారు. ఖాదిర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ అధికారి పట్ల ప్రేమాభిమానాలు చూపించారు.

గొడవ సద్దుమణిగిన తరువాతే వెళ్లమని చెప్పి ఆశ్రయమిచ్చారు. అనంతరం అజయ్ కుమార్‌ని పోలీస్ స్టేషన్‌లో దించి వచ్చారు ఖాదిర్. దేవుడిలా వచ్చి నన్ను కాపాడారు. ఆయన సమయానికి ఆదుకోకపోతే నేను ప్రాణాలతో మిగిలే వాడిని కాదంటూ అజయ్ కుమార్ చేతులు జోడించి హాజీ ఖాదిర్‌కి కృతజ్ఞతలు చెప్పారు.