తెలంగాణ కొత్త CSగా సోమేశ్ కుమార్

Update: 2019-12-31 12:41 GMT

తెలంగాణ కొత్త CSగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న ఆయన.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం మంగళవారంతో ముగిసింది. కొత్త సీఎస్‌ రేసులో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌, శాంతికుమారి, అధార్‌సిన్హా పేర్లు వినిపించాయి. అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌ రేసులో ముందుండగా.. సీఎం కేసీఆర్ సోమేశ్ కుమార్ వైపే మొగ్గారు.

సోమేష్‌కుమార్‌కు మరో మూడన్నరేళ్ల పాటు సర్వీసు ఉండటం ఆయనకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన సోమేశ్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఆయన గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ విధులు నిర్వహించారు. ఏ పదవి అప్పగించినా సమర్థంగా, నమ్మకంగా పనిచేస్తారనే పేరు ఉంది. అందుకే రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించినప్పటికీ.. పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించి తెలంగాణకు తీసుకువచ్చారు.

సీనియారిటీ ప్రకారం చూస్తే సోమేష్ కుమార్ కంటే అజయ్‌మిశ్రానే ముందున్నారు. ఆయనకు కేవలం ఆరు నెలల సర్వీసు మాత్రమే ఉండటం మైనస్‌గా మారింది. ఇక రిటైర్ అయిన శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

Similar News