రాజధాని తరలింపు ఆవేదనతో ఆగిన మరో రైతు గుండె

Update: 2020-01-06 01:59 GMT

రాజధాని తరలింపు ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది.. గుండెపోటుతో వెంకటపాలానికి చెందిన రైతు ముసునూరు వెంకటేశ్వర్‌రావు మృతిచెందాడు.. వెంకటేశ్వర్‌రావు 19 రోజులుగా నిరసనలు, దీక్షల్లో పాల్గొన్నాడు.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతోనే వెంకటేశ్వర్‌రావు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇక రాజధానిని తరలించొద్దన్న నినాదాలు అమరావతి గ్రామాల్లో హోరెత్తుతున్నాయి.. నిరసనలు, దీక్షలు, ధర్నాలతో తమ పోరాటాన్ని ఉధృతం చేశారు అమరావతి ప్రాంత రైతులు. మందడం, ఎర్రబాలెం, నీరుకొండ, తుళ్లూరుతో పాటు రాజధాని పరిధిలోని గ్రామాల్లో రిలీ దీక్షలు చేస్తున్నారు. ధర్నాల్లో మహిళలు, రైతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిపై విష ప్రచారాన్ని అపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మందడంలో టెంట్‌లో నిరసన దీక్ష చేస్తున్న సుబ్బయ్య అనే రైతు నీరసంతో పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ఆంగీకరించకపోడంతో రైతుకు టెంట్‌లోనే సెలైన్‌ పెట్టారు వైద్యులు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని సుబ్బయ్య స్పష్టం చేశారు. రాజధాని అమరావతి కోసం బలిదానాలు మొదలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అటు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో పొంగళ్లు వండి నిరసన తెలిపారు... రాజధానిగా అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు.. రాజధాని కోసం ప్రాణాలైన ఆర్పిస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణపాలెంలో స్థానికులు ఆందోళనకు దిగారు.. వినూత్నంగా తమ నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు.

మరోవైపు రాజధానిలో మహిళా రైతులపై పోలీసుల దాడిని అఖిలపక్ష విద్యార్థి విభాగం నాయకులు ఖండించారు. గుంటూరులో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజధాని కోసం చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేయడం తప్పా అని ప్రశ్నించారు విద్యార్థి నాయకులు. రాజధానిపై సీఎం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ సభ్యులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జగన్‌ మనస్సు మారి మూడు రాజధానుల ఆలోచనను మానుకోవాలని కోరారు. అన్ని హంగులతో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

అమరావతి కోసం యువ రైతులు చేస్తున్న పాదయాత్రకు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘన స్వాగతం లభించింది. స్థానిక యువత ఘనస్వాగతం పలికారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తించాలని యువరైతులు కోరారు. అమరావతి రాష్ట్రనడిబొడ్డున ఉందని.. దీన్ని అందరూ గుర్తించాలన్నారు. మూడు రాజధానుల ఆలోచనను సీఎం జగన్‌ విరమించుకోవాలన్నారు.

గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు మౌన దీక్ష చేపట్టారు. రాజధాని కోసం మహిళలు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు.. అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడంపై వారు మండిపడ్డారు.

అమరావతి కోసం అనంతపురం జిల్లా కదిరిలో నిరసనలు కొనసాగుతున్నాయి.. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో రోజుక రీతిలో వినూత్న నిరసనలు తెలుపుతున్నారు.. రాజధాని సీఎం జగన్‌ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. అర్‌ అండ్‌ బీ బంగ్లా నుంచి బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు.