చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Update: 2020-01-09 09:01 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. అందరికీ మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరులో సీఎం జగన్ దీన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ అందరికీ పథకం వర్తిస్తుంది. దీంట్లో భాగంగా.. ఏటా ప్రతి తల్లికి రూ.15 వేలు చేయూతగా ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో అమ్మ ఒడికి 6వేల 456 కోట్లు కేటాయించారు.

పథకం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ప్రపంచంతో పోటీ పడి మన విద్యార్థులు చదువుకోవాలని ఆకాంక్షించారు. పేదరికం చదువుకు అడ్డం కాకూడదనే లక్ష్యంతోనే అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చినట్లు జగన్‌ చెప్పారు. 81.72 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.

అమ్మఒడిలో భాగంగా ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోనే వేసేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సంరక్షకుల ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులు వేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ అర్హత పత్రాల సమర్పణలో ఇబ్బందుల వల్ల ఎవరైనా పథకానికి దూరమైనా.. సంబంధిత అధికారుల లేఖలు తీసుకొస్తే ఆ తల్లిని కూడా అమ్మఒడి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు.

Similar News