అమరావతి కథలో క్లైమాక్స్‌.. నేడు తుది నిర్ణయం

Update: 2020-01-20 01:18 GMT

అమరావతి కథ క్లైమాక్స్‌ చేరింది.. నేడు తుది నిర్ణయం ప్రకటించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలపై అధ్యయనం చేసి, హైపవర్‌ కమిటీ రూపొందించిన నివేదిక గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లులు, చర్చకు వచ్చే అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణం, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించే అంశంపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. తరువాత 10 గంటలకు బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు చేయనున్నారు. ఆ వెంటనే 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి..

మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో.. ఇవాళ పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మండలిలో బిల్లులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ వివిధ కమిటీలు, నిపుణుల సూచనల మేరకు అసెంబ్లీలో సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. సీఆర్‌డీఏకు బదులుగా అమరావతి మెట్రోపాలిటిన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సమాచారం. ఈ విషయం కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Similar News