రాహుల్, మమతా బెనర్జీ కోరుకుంటే.. సీఏఏపై చర్చకు సిద్ధం: అమిత్ షా

Update: 2020-01-22 14:51 GMT

 

పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మోదీ సర్కారు మరోసారి స్పష్టం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునే ఛాన్సే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశాలు, ప్రతిపక్షాల తీరును అమిత్ షా వివరించారు. దేశాన్ని ముక్కలు చేయాలంటున్న టుక్‌డే టుక్‌డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోందని విమర్శించారు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఒకే స్వరంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఏఏపై రాహుల్, మమతా బెనర్జీ ఎక్కడ కోరుకుంటే అక్కడ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేశారు. 13 నెలల్లో రామాలాయన్ని నిర్మిస్తామని తెలిపారు. భవ్య రామమందిర నిర్మాణం భారతీయుల చిరకాల ఆకాంక్ష అని గుర్తు చేశారు.