విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకుంటాం : చంద్రబాబు

Update: 2020-01-24 08:34 GMT

ఏపీకి 3 రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. మండలిలో అధికార పార్టీ సభ్యుల తీరుపై ఏపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.. వారు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమన్నారు. చైర్మన్‌పైనా..టీడీపీ ఎమ్మెల్సీలపైనా దాడికి ప్రయత్నించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మండలిలో టీడీపీ నిబందనలకు అనుగుణంగా వ్యవహించిందన్నారు. మండలి చైర్మన్‌గా తనకున్న విచక్షనాధికారాలతోనే బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారని గుర్తు చేశారు. కేవలం రెండు రోజుల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు.

మండలిలో టీడీపీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని.. వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరామన్నారు చంద్రబాబు. గత ఎనిమిది నెలల నుంచి వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తోందని.. కానీ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతుందని చంద్రబాబు అన్నారు. హెరిటేజ్‌ఫ్రెస్‌ వ్యాపార విస్తరణలో భాగంగా నాగార్జున యూనివర్శిటీ పరిధిలో భూములు కొంటే.. అది ఇన్‌సైడ్‌ డ్రేటింగ్‌ ఎలా అవుతుందన్నారు.

రాజధానిపై వాదించేందుకు అడ్వొకేట్‌కు ప్రభుత్వం రూ.5కోట్లు ఇస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పేద రైతులు ఇచ్చిన భూములు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా తాము అనుకున్న పని చేయటమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ప్రజల బాగోగులు, అవసరాల కంటే వారి పంతం నెగ్గించుకోవటం, టీడీపీ మీద పగ సాధించటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు.