మండలి పరిణామాలను గవర్నర్‌కు వివరించిన టీడీపీ నేతలు

Update: 2020-01-25 09:08 GMT

మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు మండలికి వచ్చిన సమయంలో అధికార పక్షం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలి ఛైర్మన్ సభ నిబంధనలు, తన అధికారాల మేరకు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించటాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేక దాడులకు దిగుతోందని ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.

చంద్రబాబు ఆధ్వర్యంలో గవర్నర్‌ వద్దకు వెళ్లిన టీడీపీ బృందం మెమొరాండం ఇచ్చింది. శాసన మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. మంత్రులు, వైసీపీ సభ్యుల తీరును ఆయనకు వివరించారు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పొలిటికల్‌ టెర్రరిజం నడుస్తోందన్నారు. వైసీపీ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోందని, రూల్స్‌ కూడా పాటించకుండా సభ నుంచి.. టీడీపీ సభ్యులను బయటికి గెంటేశారని ఆరోపించారు. చైర్మన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని, మండలిలో సభ్యులను దారుణంగా హింసించారని అన్నారు. ఈ అంశాలన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

మరోవైపు రాజధాని ఆందోళనలపై టీడీపీ నేతలు రామానాయుడు, అశోక్‌బాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 39 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

ఏలాంటి రిపోర్ట్‌ రాకుండానే మూడు రాజధానుల ప్రకటన చేసిన సీఎం జగన్.. మండలిని రద్దు చేసేందుకు రెడీ అవుతున్నారని కూడా గవర్నర్ కు వివరించినట్లు చెబుతున్నారు. అయితే..మండలి రద్దుపై ప్రభుత్వం ఆలోచన మార్చుకోకుంటే పోరాటం ఉద్దృతం అవుతుందని హెచ్చరించారు.