ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభకు హాజరైన 133 మంది ఎమ్మెల్యేలూ మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను రాజకీయ కోణంలో పెద్దలసభ అడ్డుకోవడం దారుణం అని అన్నారు. అలాంటి సభ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అన్నారాయన. మంచి నిర్ణయాల అమలు ఆలస్యం కాకూడదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
శాసనమండలి రద్దు అధికారాన్ని రాజ్యాంగం అసెంబ్లీకే ఇచ్చిందని సీఎం జగన్ గుర్తుచేశారు. కొన్నాళ్లు పోతే మండలిలో వైసీపీకే ఆధిక్యం వస్తుందని అన్నారు. అయినా కీలక బిల్లులపై కాలయాపన తప్ప మండలితో ఒరిగేదేమీ లేదని అన్నారు. అలాంటి సభను రద్దు చేయాలని తీర్మానం పెట్టడం సంతోషంగా ఉందని సీఎం జగన్ స్పష్టంచేశారు.