16 ఏళ్ళ తర్వాత యూఏఈకి ఇళయరాజా

Update: 2020-02-06 15:54 GMT

సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయనే పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌ ఇళయరాజా. ‘మేస్ట్రో’గా భారత సినీ సంగీత ప్రపంచంలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1978లో ‘అన్నాకిలి’ అనే సినిమాతో సినీ సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇళయరాజా. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో అవార్డులు, ఎన్నెన్నో ప్రశంసలు ఆయన సొంతం చేసుకున్నారు. ఐదు సార్లు ఇళయరాజా జాతీయ అవార్డుని అందుకున్నారంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ‘సైకో’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు.

ఇళయరాజా 16 ఏళ్ళ తర్వాత యూఏఈకి ‘ఇసై రాజంగం’ కోసం వెళ్లనున్నారు. మార్చి 27న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇళయరాజా 44 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానాన్ని ఇక్కడ వీక్షించేందుకు అవకాశమేర్పడుతోంది. షార్జా క్రికెట్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఈ కార్యక్రమానికి విశేష అతిథి గా హాజరవుతారు. హాల్స్‌ స్టూడియోస్‌, అభిషేక్‌ ఫిలింస్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రముఖ గాయకులు బాలసుబ్రమణ్యం, హరిహరన్‌, మనో, మదుబాలా క్రిష్ణన్‌, ముఖేష్‌, శ్వేతా మోహన్‌, సుర్ముగి, ఉషా ఉతుప్‌, అనితా కార్తికేయన్‌, ప్రియా హిమేష్‌, విభావరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు.

Similar News