జంట హత్యల కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు మరణశిక్ష

Update: 2020-02-07 09:04 GMT

నెల్లూరు జిల్లాలోని హరనాధపురం రామాలయం వీధిలో ఏడు సంవత్సరాలక్రితం జరిగిన జంట హత్యల కేసులో జిల్లా అదనపు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టున్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి తీర్పు వెల్లడించారు. 2013 ఫిబ్రవరి 12న జరిగిన మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్య ఆధారాలతో సహ రుజువవడంతో కోర్టు ఈ తీర్పును ఖరారు చేసింది.

నెల్లూరు జిల్లాలోని హరనాధపురం రామాలయం వీధిలో సన్, వాగ్దేవి ఫార్మసీ కాలేజీల యజమాని దినకర్ 2013లో నూతన భవన నిర్మాణం చేపట్టారు. ఆర్ధిక లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తాయి. దీంతో దుండగులు దినకర్ ఇంటికి వచ్చి అతని భార్య శకుంతల,కుమార్తె భార్గవిపై విచక్షణారహితంగా కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో శకుంతల, భార్గవి ఘటనా స్థలంలోనే మరణించగా.. దినకర్, అతని స్నేహితుడు గాయపడ్డారు. ఇంట్లోనుంచి అరుపులు, కేకలు వినిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. గాయపడిన దినకర్, అతని స్నేహితుడిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దారుణానికి ఒడిగట్టిన ఇంతియాజ్, వంశీకృష్ణ, మురళీ మనోహర్‌ను పోలీసులు అరెస్టుచేశారు.

జంట హత్యలకేసులో 7 ఏళ్లు సాగిన విచారణలో నెల్లూరు జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రధాన దోషి ఇంతియాజ్ పలు హత్యల కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు దోషులూ మైనర్లు కావడంతో వారికి గతంలోనే 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

Similar News