తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ఆసక్తి కరంగా మారింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తాపత్రయ పడుతున్న ఆ పార్టీ.. కొత్తనేతను ఎన్నుకునే పనిలో తలమునకలైంది. అందులో భాగంగా ఈ నెల 22,23, 24 తేదీలో మంచిర్యాల లో రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించనుంది. ఈ సభ వేదికగా పార్టీకి సంభందించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా కార్యదర్శులతో పాటు రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక పైన కూడా చర్చ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో పదవీకాలం ముగియకముందే కొత్త జిల్లా కార్యదర్శులను ఎన్నుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో కార్యదర్శులను కొనసాగించాలా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ జిల్లా కార్యదర్శిపై ఇదే తరహా ఇబ్బంది తలెత్తుతోంది. పాత కార్యదర్శినే కొనసాగించాలని కొంత మంది చెబుతుంటే .. మరికొంత మంది మాత్రం ఆయన వల్ల జిల్లాలో పార్టీకి ఒరిగిందేమీ లేదని.. కొత్త వారిని ఎన్నుకుంటేనే పార్టీ బాగుపడుతుందని అదిష్టానం దృష్టికి తీసుకు వస్తున్నారు. ఈ అంశాన్ని సహయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఏ జిల్లాకు ఎవరు కొత్త కార్యదర్శిగా వస్తారు..ఎవరు కొనసాగుతారనేది సస్సెన్స్ గా మారింది.
మంచిర్యాల లో జరిగే సీపీఐ నిర్మాణ మహా సభల సందర్భంగా జిల్లాకార్యదర్శులు, కార్యవర్గాల ఎన్నిక పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పదవీ కాలం మూగియక పోయినా కొత్త కార్యదర్శిని ఎన్నుకునే వెసులు బాటు ఉండటంతో ప్రస్తుత కార్యదర్శులు ఏ మేరకు మార్పుకు ఒప్పుకుంటారో చూడాలి. మరోవైపు ఈ సారైనా తమకు అవకాశం కల్పించాలని కూనంనేని వర్గీయులు బలంగా కోరుతున్నారు. అయితే పార్టీలో సహాయ కార్యదర్శిగా ఉన్న పల్లా వెంకట్ రెడ్డి సైతం కార్యదర్శి పదవిని ఆశిస్తున్నారు. పార్టీకి దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న తమకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని ఈ ఇద్దరు నేతలు జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారు. అదిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
చాడా పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉన్నా ముందస్తు పార్టీ నిర్మాణ మహాసభల్లో భాగంగా భారీగా మార్పులు చేర్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ త్రిముఖ పోటీలో చాడా తన స్థానాన్ని కాపాడుకుంటారా లేక.. కొత్త నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.