ఏపీలో సెలక్ట్ కమిటీ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న నిర్ణయంపై తొలి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. శాసన మండలి చైర్మన్ నిర్ణయాన్ని అధికార పక్షం తొలి నుంచి తప్పుబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపిస్తూ వచ్చింది. అక్కడి నుంచి మొదలైన సెలక్ట్ కమిటీ వ్యవహారం ఎప్పటికప్పుడు కొత్త ట్విస్ట్ లతో ఆసక్తికరంగా మారుతోంది.
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అలాగే సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి ఛైర్మన్ ఆదేశించారు. ఛైర్మన్ పంపిన ఫైలును మండలి కార్యదర్శి వెనక్కి పంపించారు. దీనిపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మండలి ఛైర్మన్ 48 గంటల గడువు ఇచ్చారు. అయితే.. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ ఛైర్మన్‌కు పంపిన నోట్‌లో సెక్రటరీ తేల్చిచెప్పారు. రెండోసారి కూడా ఫైల్ ను తిప్పిపంపారు.
సెలక్ట్ కమిటీ ఫైలు వ్యవహారం మరోసారి అధికార-ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరుపక్షాలు విమర్శలు-ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. గడువులోగా సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కానందున బిల్లులు ఆమోదం పొందినట్లేనని, ఇక రావాల్సింది గవర్నర్ ఆమోదమేనని మంత్రులు, అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. అటు ప్రతిపక్షం కూడా మండలి కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలి కార్యదర్శిపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది టీడీపీ. సెలక్ట్ కమిటీ ఫైల్‌ను మళ్లీ వెనక్కి పంపడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సభ్యులెవరైనా దీనిపై నోటీసు ఇవ్వొచ్చన్నారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం ఛైర్మన్‌కి ఉందన్నారు. పార్టీ పరంగా ఏంచేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని యనమల చెప్పారు.