జర్మనీలో కాల్పులు.. 9 మంది మృతి

Update: 2020-02-20 19:46 GMT

వరుస కాల్పులతో జర్మనీ హోరెత్తిపోయింది. ఓ వ్యక్తి కాల్పుల్లో 9 మంది మరణించారు. పదులమంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తన తల్లిని కూడా కాల్చి చంపాడు. తుపాకుల శబ్దంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బుల్లెట్ల శబ్దాలతో ప్రజలు వణికిపోయారు.

హనావ్ నగరంలో టోబీ ఆర్ అనే యువకుడు చెలరేగిపోయాడు. రెండు స్మోకింగ్ బార్లను టార్గెట్ చేసి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకులు పేలడంతో స్మోకింగ్ బార్లలో ఉన్నవాళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తూటాల నుంచి కొంతమంది సురక్షితంగా బయటపడగా 9 మంది బలయ్యారు. ఇక, స్మోకింగ్ బార్లలో కాల్పులు జరిపిన టోబీ ఆర్, ఆ తర్వాత తన అపార్ట్‌మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే మరో మృతదేహం కూడా దొరికింది. ఆ డెడ్‌బాడీ టోబీ ఆర్ తల్లిదిగా భావిస్తున్నారు. టోబీ ఆర్ అతివాద భావజాలంతో ప్రేరేపితుడయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారం బెర్లిన్‌లో దుండగులు కాల్పులు జరిపారు. టెంపో డ్రమ్‌లో కామెడీ షో జరుగుతున్న సమయంలో దాడి చేసి ఓ వ్యక్తిని హతమార్చారు.