ఆ చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి తప్ప.. ప్రపంచంలో ఎక్కడా లేదు : మాజీ మంత్రి యనమల

Update: 2020-02-23 15:44 GMT

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై సిట్ వేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి తప్ప.. ప్రపంచంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఆస్తుల కేసులో జగన్‌పై జరుగుతున్న కోర్టు విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించే పన్నాగంగా అభివర్ణించారు. జగన్ అవినీతిపై 11 ఛార్జిషీట్లలో విచారణ ముగింపు దశకు వచ్చిందని యనమల అన్నారు. దాన్ని కవర్‌ చేసుకునేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారని ఆయన విమర్శించారు. హత్యల కంటే ఆర్థిక నేరాలు ప్రమాదకరమైనవిగా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. జగన్‌ మోహన్ రెడ్డి 43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొందని యనమల తెలిపారు. వేల కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర సంపదను దోపిడీ చేశారని ఆరోపించారు. అది అతిపెద్ద నేరమని.. రాష్ట్రానికి తీరని నష్టం చేశారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందన్నారు.. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్‌ 9 నెలల పాలనను తుగ్లక్‌ చర్యలతో పోల్చారాయన. రాష్ట్రంలో పెట్టుబడులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. యువతకు ఉపాధి దొరకడం లేదన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని యనమల తెలిపారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలను రద్దు చేశారని, కోతలు విధించారని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో రెవెన్యూ వ్యయం ఆకాశాన్ని అంటిందని యనమల అన్నారు.

రాష్ట్రంలో పోలీస్‌ రాజ్‌ను తీసుకొచ్చారని యనమల ఆరోపించారు. చట్టాలను తుంగలో తొక్కారని.. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ నుంచి రాజధానిని మార్చిన మహ్మద్ బీన్‌ తుగ్లక్.. నష్టాన్ని గుర్తించి.. రాజధాని మళ్లీ ఢిల్లీకి తీసుకొచ్చారని చరిత్రను గుర్తుచేశారు యనమల రామకృష్ణుడు. అమరావతికి భూములిచ్చిన రైతులు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం గుర్తించడం లేదని తప్పుపట్టారు. రాష్ట్రం అట్టడుకుతున్నా.. పాలనా యంత్రాంగం స్తంభించినా.. జగన్‌ గుర్తించడం లేదన్నారు. రాష్ట్రానికి వాటిల్లే నష్టాన్ని సరిద్దిదడం లేదని యనమల విమర్శించారు.

ఎన్టీఆర్ పాలనపైన, చంద్రబాబు జమానాపైనా గతంలో చాలా కమిషన్లు వేశారని.., విచారణ చేపించారని యనమల గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏమీ గుర్తించలేకపోయారని అన్నారు. ఐనా.. ఐదేళ్ల పాలనపై విచారణ చేసిన దాఖలాలు ఎన్నడూ లేవన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం టీడీపీ ప్రభుత్వాలు పనిచేశాయి తప్ప.. డబ్బుల కోసం కాదని స్పష్టంచేశారు. అందుకే.. 26 విచారణలు వృధా ప్రయత్నంగా మిగిలాయన్నారు. ఏ ఒక్క ఆరోపణ రుజువు చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదని యనమల స్పష్టంచేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ 9 నెలల్లో.. చాలా విచారణలు జరిగాయన్నారు యనమల. 3 సిట్‌లు, 6 కమిటీలు, కేబినెట్‌ ఉప సంఘం, విజిలెన్స్ విచారణలు చేశారన్నారు. అధికారంలో చేతిలో ఉన్నా.. ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారని గుర్తుచేశారు యనమల. జగన్ సన్నిహితుడి నేతృత్వంలో సిట్ వేయడం దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. టీడీపీ పాలనను అప్రదిష్టపాలు చేసేందుకే వైసీపీ ప్రభుత్వం పన్నాగం పన్నిందని దుయ్యబట్టారు. పాలన చేతరాక, అడ్డగోలు నిర్ణయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు. 9 నెలల వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై కూడా హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని యనమల డిమాండ్ చేశారు.

Similar News